తన పెంపుడు కుక్కలకు భానుమతి, రామకృష్ణ పేర్లు పెట్టిన ప్రముఖ నిర్మాత!
on Oct 16, 2024
సినిమా రంగంలో హిపోక్రసీ అనేది ఎప్పుడూ రాజ్యమేలుతూ ఉంటుంది. నలుగురు ప్రముఖులు కలుసుకున్నప్పుడు పైకి మాట్లాడేది ఒకటుంటుంది, మనసులో మరొకటి ఉంటుంది. ఒక వ్యక్తిని పొగిడిన నోటితోనే అతను వెళ్లిపోయిన తర్వాత అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. సాధారణ వ్యక్తుల్లోనూ ఇది ఉంటుంది. అయితే సినీ ప్రముఖుల విషయంలో దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. అయితే సినిమా పరిశ్రమలోనూ హిపోక్రసీ అనేది లేనివారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు ఉన్నారు. అలాంటి వారిపై వివాదాస్పదులు అనే ముద్ర వేస్తుంది ఇండస్ట్రీ. అలాంటి ఓ నిర్మాత, యువరత్న ఆర్ట్స్ అధినేత కె.మురారి. ఆయన ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించారు. ఆయన నిర్మించిన 9 సినిమాల్లో 8 సూపర్‌హిట్ అయ్యాయి. మురారి నిర్మించిన అన్ని సినిమాలూ మ్యూజికల్ హిట్సే. 1990లో వచ్చిన నారీ నారీ నడుమ మురారి ఆయన చివరి సినిమా. అలాంటి సక్సెస్‌ఫుల్ నిర్మాత సినిమాలకు దూరంగా ఎందుకు వెళ్లిపోయారు? తన ఆత్మకథగా ‘నవ్విపోదురుగాక’ అనే పుస్తకం రాసిన మురారి అందులో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? ఎవరిని విమర్శించారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.
మెడిసన్ చదువును మధ్యలో ఆపేసి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు మురారి. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి ఆ తర్వాత నిర్మాతగా మారారు. 1978లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నిర్మించిన సీతామాలక్ష్మి చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామకళ్యాణం, శ్రీనివాసకళ్యాణం, జానకి రాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి సూపర్‌హిట్ సినిమాలను నిర్మించారు. తన ప్రతి సినిమాలోనూ సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అన్ని సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేశారు. నారీ నారీ నడుమ మురారి తర్వాత మారిన పరిస్థితులు తన మనస్తత్వానికి సరిపడక చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో ‘నవ్విపోదురుగాక’ అనే పుస్తకాన్ని రచించారు. అందులో కొందరు సినీ ప్రముఖులపై పలు విమర్శలు చేశారు. హీరోలను, దర్శకులను ఎవరినీ వదిలిపెట్టలేదు.
అంతేకాదు.. తను పెంచుకుంటున్న కుక్కలకు భానుమతి, రామకృష్ణ అనే పేర్లు పెట్టి ఇండస్ట్రీలో మరింత వివాదాస్పదమయ్యారు. కుక్కలకు వారి పేర్లు పెట్టడం వెనుక కారణాలను ఒక టీవీ ఇంటర్వ్యూలో మురారి వివరిస్తూ ‘భానుమతిగారు తలమీద పెట్టుకోవాల్సిన దేవత. గొప్ప వ్యక్తి. అలాగే రామకృష్ణగారు మహానుభావుడు. వాళ్ళంటే నాకెంతో గౌరవం. ‘రామకృష్ణగారూ.. రండి సార్’ అని మా కుక్కను పిలుస్తాను. ఈ పేర్లు పెట్టడం వెనుక ఒక తమాషా సంఘటన ఉంది. చలనచిత్ర నిర్మాతల చరిత్ర రాసే సమయంలో భానుమతిగారికి సంబంధించిన వివరాల కోసం నేను వెళ్లినపుడు.. రేపు రా, ఎల్లుండి రా అంటూ నన్ను బాగా విసిగించారు. అదే సమయంలో నా ఫ్రెండ్ ఒకరు రాడ్‌వేలర్ బ్రీడ్ మేల్, ఫిమేల్ కుక్క పిల్లలు ఇచ్చారు. వాటికి భానుమతి, రామకృష్ణ అని పేర్లు పెట్టాను. ఈ విషయం తర్వాత భానుమతిగారికి చెప్పాను. దాన్ని ఆమె కూడా సరదాగా తీసుకున్నారు.
భానుమతిగారు నా పుస్తకానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో ఒకరోజు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, లండన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఆమెకు ఫోన్ చేసి ఒక డిఫరెంట్ స్లాంగ్‌లో ‘ఇండియాలో గ్రేట్ పర్సన్స్ అయిన సత్యజిత్‌రే, భానుమతి వంటి వారి గురించి రాస్తున్నాము’ అని ఇంగ్లీష్‌లో చెప్పాను. దానికామె ఎంతో సంతోషించింది. ‘నెక్స్‌ట్ డే మా కరస్పాండెంట్ మీ దగ్గరికి వస్తారు’ అని చెప్పాను. మరుసటి రోజు ఆమె దగ్గరికి వెళ్ళాను. నన్ను తేరిపార చూసి ‘మిమ్మల్ని ఎక్కడో చూశాను’ అని.. కాసేపటికి గుర్తుపట్టారు. ‘ఎందుకిలా చేశారు’ అని అడిగారు. ‘ఏం చెయ్యమంటారండీ.. చావగొడుతుంటే..’ అన్నాను. దానికామె పగలబడి నవ్వారు. మాటల సందర్భంలోనే ‘మీ మీద కోపంతో మా కుక్కకి మీ పేరు పెట్టాను’ అని చెప్పాను. ‘పోన్లెండి. ప్రతిరోజూ నన్ను తలుచుకుంటున్నారు కదా’ అన్నారు. నేను రాస్తున్న పుస్తకానికి సంబంధించిన అన్ని వివరాలు ఆమె దగ్గర నుంచి సేకరించాను. కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఒకరోజు ఫోన్ చేసి ‘మా ఆయన భోజనం చేశారా?’ అని మా కుక్కని ఉద్దేశించి అడిగారు. ‘ఎక్కడండీ చావగొడుతున్నారు’ అన్నాను. ‘మా ఆయన కూడా అలాగే చావగొట్టేవారు’ అంటూ ఎంతో సరదాగా చెప్పారు’ అంటూ భానుమతితో జరిగిన తమాషా సంఘటన గురించి వివరించారు నిర్మాత కె.మురారి.
Also Read